న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలో స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో సాంచెజ్, అలాగే.. ఫిన్లాండ్ పీఎం పెట్టేరి ఓర్పోతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ సందర్భంగా జరిగిన ఈ భేటీల్లో భారత్, యూరోపియన్ యూనియన్(ఈయూ) ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్ టీఏ) గురించి నేతలు చర్చించారు. ఎఫ్ టీఏ భారత్, యూరప్ సంబంధాల్లో స్వర్ణయుగం అవుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో సాంచెజ్‌తో జరిగిన సమావేశంలో.. రక్షణ, భద్రత, సాంకేతికత రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై మోదీ చర్చించారు. 2026ను భారత్, స్పెయిన్ సంస్కృతి, పర్యాటకం, ఏఐ సంవత్సరంగా జరుపుకుంటున్నామని.. ఇది ఇరు దేశాల ప్రజల మధ్య రిలేషన్లను మరింత బలపరుస్తుందన్నారు. ఈ ఒప్పందం స్పెయిన్‌తో ఆర్థిక భాగస్వామ్యానికి కొత్త అవకాశాలు తెరుస్తుందని చెప్పారు. భారత్, స్పెయిన్ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని, మానవ ఆధారిత ఏఐతో ముందుకు సాగాలని సాంచెజ్ అభిప్రాయపడ్డారు. అనంతరం ఫిన్లాండ్ ప్రధాన మంత్రి పెట్టేరి ఓర్పోతోనూ మోదీ మీట్ అయ్యారు.
